అన్నమయ్య కీర్తన - ఏ పురాణమున ఎంత వెదికినా

అన్నమయ్య కీర్తన " ఏ పురాణమున ఎంత వెదికినా.... " లో సున్నితంగా చెప్పినా లౌకిక జీవితానికి అన్వయించే మార్గాలు సూచించారు. ఈ మార్గాన వెళితే మనిషి కి శాంతి తథ్యం. వివరణకు ముందు కీర్తన,  తరువాత జేసుదాసు గారి గానం ఇస్తున్నాను.


|| ఏ పురాణముల ఎంత వెదికినా | శ్రీపతి దాసులు చెడరెన్నడును ||

|| హరి విరహితములు అవికొన్నాళ్ళకు | విరసంబులు మరి విఫలములు |
నరహరి గొలిచిటు నమ్మిన రవములు| నిరతము లెన్నడు నెలవులు చెడవు ||

|| కమలాక్షుని మతిగానని చదువులు | కుమతంబులు బహు కుపథములు |
జమళి అచ్యుతుని సమారాధనలు | విమలములేకాని వితథముకావు ||

|| శ్రీవల్లభుగతి జేరనిపదవులు | దావతులు కపట ధర్మములు |
శ్రీవేంకటపతి సేవించు సేవలు | పావనము లధిక భాగ్యపు సిరులు ||

జేసుదాసు గారి గానం:

https://www.youtube.com/watch?v=h4_kHpIYKWU&list=RDh4_kHpIYKWU

వివరణ 
అన్నమయ్య రచనలు బహు సరళంగా అందరికీ అర్ధమయేలాగానే ఉంటాయి. నేను ఆయన వెలిబుచ్చిన ఆలోచనలను, కేవలం వివరిస్తున్నాను. ఈ పాట అప్పటికన్నా(అన్నమయ్య 15వ శతాబ్దం వాడు),  ఇప్పుడే ఎక్కువ అవసరం. శాంతి, ఆనందములే ముఖ్యమని ప్రతి మనిషికీ తెలిసినా, మనిషి ఎంచుకుంటున్న జీవన విధాలు, విలువలు, దృక్పథం మనిషికి అశాంతినే మిగులుస్తోంది. అన్నమయ్య ఎలాంటి విలువలు, దృక్పథం ఆచరిస్తే మనిషికి ఆనందం దొరుకుతుందని హామీ ఇస్తున్నారో చూద్దాం.

"|| హరి విరహితములు అవికొన్నాళ్ళకు | విరసంబులు మరి విఫలములు |
నరహరి గొలిచిటు నమ్మిన రవములు| నిరతము లెన్నడు నెలవులు చెడవు ||"

పరుగుల జీవితములో భగవంతుని తలచే, కొలిచే సమయం కూడా మనిషి ఉండటం లేదు. 'లభించటం లేదు' అని నేను అనటం లేదు, ఎందుకంటే మనసుంటే మార్గముంటుంది. భగవంతుని విస్మరించిన జీవితం కూడా  కొంత సౌఖ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వవచ్చు. కానీ, జీవితంలో ఆటు పోటులు, మనిషిని మనస్సుకే కట్టి పడేస్తుంది. అందువలన  మనస్సు అనేక అనుభవాలకు లోనై, సుఖ దుఃఖాలని అనుభవిస్తుంది. మనస్సును నియత్రించుకునే వారు ఈ దురవస్థ నుండి త్వరగా బయటపడగలరు, కానీ వారున్నూ అన్ని బాధలు ఓర్చుకోలేరు. భావోద్వేగులు ఇతరుల సాన్నిధ్యం కోరుకొంటారు, భగవంతుని ఆశ్రయిస్తారు. శాశ్వతమైన శాంతి మనస్సుని నియంత్రించుట వలన లభిస్తుంది. అది భగదాశ్రయం వలన త్వరగా సులభముగా లభిస్తుంది, తప్పక లభిస్తుంది. అదే అన్నమయ్య "శ్రీపతి దాసులు చెడరెన్నడును" తెలియచెప్పేది. 'నెలవులు' అంటే [ఉద్యోగం అన్న అర్ధం ఉన్నా ఇక్కడ] మానసిక స్థిరత్వము  గా తీసుకోవచ్చును.

"కమలాక్షుని మతిగానని చదువులు | కుమతంబులు బహు కుపథములు |
జమళి అచ్యుతుని సమారాధనలు | విమలములేకాని వితథముకావు || "

మనిషికి చదువు విజ్ఞానముతో వివేచనని కలుగచేస్తుంది. లౌకికవిద్య మనిషికి తనకీ, తన కుటుంబానికీ బ్రతుకు తెరువు , సుఖాలను సమకూరుస్తుంది. ఈ పరిధిని మించి తన సంఘం, రాష్ట్రము, దేశం గురించి ఆలోచింపచేసేదే అలౌకిక విద్య. ఈ చదువు భగవంతుడు కేంద్రంగా సాగుతుంది. భగవంతుడు అంటే సర్వ ప్రాణ కోటి, వాటిలోని ఏకత్వము . ఏ చదువు ఐనా భగవంతుని విస్మరిస్తే అది మనిషిని అశాంతి పాలుచేసి, అధోగతికి గురి చేస్తుంది.

భగవంతుని నమ్మని వారు, నాస్తికులు అధోగతి పాలౌతారా ?  భగవంతుడంటే సాకార, నిరాకార బ్రహ్మల సమ్మేళనములు, ఇంకా అంతకు మించిన్నీ, భగవంతుడు ఒక శక్తి, ధర్మం, సంకల్పం, ప్రజ్ఞ, ఇలా నిర్వచనం కొనసాగుతూనే ఉంటుంది, ఎప్పటికీ ముగియదు. నాస్తికులైనా ధర్మంగా ఉండి, ధర్మాన్ని నమ్మకుంటే భగవంతని ఆశ్రయించినట్లే.

ఐతే, దుర్మార్గులు, నీచులు (రౌడీలు) రాజ్యమేలుతున్నారు ఎలా?దుర్మార్గుల తాత్కాలికంగా సుఖాలుపొందుతూన్నా అంత్యాన ఆనందం కోల్పోతారు.

|| శ్రీవల్లభుగతి జేరనిపదవులు దావతులు కపట ధర్మములు |
శ్రీవేంకటపతి సేవించు సేవలు పావనములధిక భాగ్యపు సిరులు ||


ఈ చరణంలో మనిషి అధికార దాహంలో, మత్తులో పడకూడదని హెచ్చరిస్తూన్నారు. అధికారం పెరుగుతూన్నకొద్దీ ఒదిగి ఉంటే స్వభావంకలవారు చాలా తక్కువ, చాలామంది అధికార మదంతో ఆ పదవి ఇచ్చను శక్తి తమ శక్తి అనీ, అది శాశ్వతమనే భ్రమలో పడతారు. ఆ భ్రమతోనే పదవిలో మరింత పెరగాలని  కోరుకుంటారూ, దానికి పాటుపడుతూంటారు,  అవలంబిస్తారు. అన్నమయ్యగారు ఇక్కడ స్పష్టమైన హెచ్చరిక చేస్తున్నారు - ప్రతి మనిషి అంతంలో పొందవలసిన పదవి ' శ్రీ వల్లభుని పాదములు, సన్నిధి'అని.ఆ పదవి పొందటానికి మనిషి ధర్మబద్ధంగానే ఉండాలి. అధర్మమార్గంలో, అన్యాయాలతో ఆ పదవి పొందేవారు అశాంతి పాలవుతారు 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగులో టైప్ చెయ్యటం ఎలా?

కుండలినీ యోగ - భౌతిక శాస్త్రం

అలౌకికం-లౌకికం