భగవంతుని నిర్వచనం
భగవంతుని నిర్వచించటము అసాధ్యం..అలాగని భక్తుడు ఊర్కొనలేడు, తన జీవితాంతము ఆలోచించి, ఆలపించి, రచించి ఆయన్ని నిర్వచిస్తూనే ఉంటాడు. ఆ రచన ఆగదు, ఆ నిర్వచనం ముగియదు, ముగించాలనీ భక్తుడూ అనుకోడు. కానీ తన ఆలాపన ద్వారా, రచనలద్వారా భక్తుడు భగవంతునిక దగ్గరవుతూంటాడు. నిర్వచనము సంపూర్ణం చేయటానికి భగవంతుడే భక్తుని తనలో చేర్చుకుంటాడు, కాక సంపూర్ణ నిర్వచనం అసాధ్యం
కేవలం భక్తిమాత్రమే ఉండి, రసోద్వేగం కొరవైన భక్తులు ఆ ఆలాపనలు, రచనలు చదివీ, భావించీ భగవంతుని మరింత తెలుసుకుంటారు.
అనంతమై, అవ్యయమైన ఈ భగవాన్నిర్వచనా నిధిలో కొన్ని పార్శ్వాలను కొందరు భక్తులు అమితంగా ప్రేమించి, స్వంతం చేసికొని ఆ ఊహలో బందీలై ఆ ఊహలకు ఇమడని భక్తి తత్వాన్ని విమర్శిస్తారు. ఆ విమర్శల ద్వారా ఇతరులనే కాక తమను తామే విమర్శించుకుంటున్నారని గ్రహించలేరు. ఎందుకంటే భగవంతుడు సంపూర్ణం, ఆయన పై మానవుడి నిర్వచనం కాదు.
ఓం పూర్ణమద: పూర్ణమిద:
పూర్ణాత్పూర్ణ ముదుచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవాయశిష్యతే!!
అలాంటి సంపూర్ణమైన భగవంతుని సంపూర్ణంగా నిర్వచించగలిగాననే దుస్సాహసం నిజమైన భక్తుడెవరూ చేయలేడు. పార్శ్వ నిర్వచనానికి బందీ అయిన కొందరు భక్తులు, తమ నమ్మకానికి అనుకూలంగా వింతవాదనలు లేవదీసి ఇతర భక్తలను భాధిస్తారు, వేధిస్తారు.
అందులో ఒక వాదం లలితలోని క్రింది శ్లోకాన్ని ఆధారం చేసుకున్న వాదన (ఈ శ్లోకంలో ఏ దోషం లేదు, దీన్ని తమ వాదనకు అనుకూలం చేసి ఇతర మార్గాలను విమర్శించటం నిరుపయోగం)
“అంతర్ముఖ సమారాధ్య, బాహ్యముఖ సుదుర్లభః”
‘అమ్మని బాహ్యంలో వెదికే కన్నా అంతరంలో శోధించే ఉపాసన సులభం’ అన్నారు, కానీ ఇదొక్కటే మార్గమని నియంత్రించలేదు. మరి అంతరాధ్యుల వాదనేమిటంటే:
బాహ్యంలో దేవుని అనుభవంలోకి తెచ్చుకోలేం, ‘అలా ప్రయత్నించే వారు చేసేది మూర్ఖ ప్రయత్నం, వారి దర్శనాలు కల్పితాలు, భ్రమలు’ అంటారు. ‘భగవంతుని వ్యక్తిగా చూడటం అసంభవం, అసాధ్యం’ అంటారు. ఇది కేవలం భగవంతుని శక్తిని అనుమానించినట్లు. భగవంతుడు తన భక్తుడు కోర్కె తీర్చటానికి ఏ రూపంలోనైనా కనపడ శక్తి కలవాడు, కనపడతాడు. ఈ సంఘటన కేవలం భగవత్సంకల్పం వల్లనే సాధ్యం, ఆయన సంకల్పాన్ని మనమెలా నియంత్రిస్తాం? వ్యక్తరూప దర్శనం సాధ్యమేనని రామకృష్ణ పరమహంస చెప్పిఉన్నారు, మరి కొన్ని దృష్టాంతాలు చరిత్రలో మనకు దొరుకుతాయి. అవి కల్పనలందామా, భ్రమలందామా?
వీరి వాదనలో దోషమేమిటంటే, ‘అనంత శక్తి స్వరూపుడైన, అవ్యయుడూ అయిన భగవంతుడు నియమిత స్వరూపుడైన రూపానికి ఎలా కుదించటం జరుగుతుంది? జరిగితే భక్తుడు దేవుని కన్నా ఇతరుడవుతాడు కదా’ అని. అనంత రూపాలు పొందగల భగవంతుడు, సర్వగతుడైన భగవంతుడు, భక్తునికి వ్యక్తరూపంలో దర్శనమిస్తూ, సర్వగతుడై ఉండగలడు...ఇది ఎందుకు అసాధ్యం??
ద
మన శాస్త్రాలు భగవంతుని 'సత్చిదానందు' డని అని ప్రకటించాయి. 'సత్చిదానందు' డంటే సత్తు, చిత్తూ,ఆనందం అన్న 3 గుణాలను సూచిస్తుంది. క్లుప్తంగా
సత్తు : విశ్వములోని పదార్ధములు
చిత్తు : విశ్వంలోని చేతనా శక్తి,
ఆనందం : అకారణమైన మధుర భావన. .
భగవంతుని అనేక నిర్వచనాలలో ‘ఆనందం స్థితి’ ఒకటి:
‘సచ్చిదానంద స్వరూపా శివోహం శివోహం
నిత్యానంద స్వరూపా శివోహం శివోహం
ఆనందం పరమానందం
ఆనందం పరమానందం’
పై గానంలో భగవంతుని ఒక అంశం నిర్వచింపబడింది - ఆనందం. ప్రతి మనిషి ఆనందాన్ని అనుభవిస్తూన్నప్పుడు దివ్యత్వాన్ని స్ప్రశిస్తూంటాడు. కానీ మనిషి ఆనందం క్షణికం, లేదా తాత్కాలికం కానీ శాశ్వతం కాదు, అయినట్లైతే భగవంతుని ఆ ‘ఆనందం’ అనే అంశంలో ఐక్యం అవుతాడు. ఆనందం పొందుతున్న ప్రతిక్షణం సాధకుని శిక్షణ సాగుతున్నట్లు భావించవచ్చును. ఐతే ఆనందానికి బాహ్యజగత్తులో కారణం లేనప్పుడు, ఆ ఆనందం అనే కార్యం దివ్యపథంలో చిన్న మైలురాయిగా భావించవచ్చును.
నిర్వచనం పై మరింత త్వరలో.....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి