మంత్రాచరణ

మంత్రాచరణ

నాకు తెలిసి మంత్రాలు రెండు వర్గాలు. బీజాక్షర మంత్రాలు, బీజసహిత మంత్రాలు - ఇవి దేవతలను స్తుతించేందుకు. ఎక్కవ నామ మంత్రాలు - అష్టోత్తరశత నామ, సహస్రనామ మంత్రాలు, సూక్తాలు. 

ఒక దేవతకు సంబంధించిన బీజాక్షరమంత్రము దేవత యొక్క సూక్ష్మ రూపం. {మనిషికి కూడా స్థూల శరీరము, సూక్ష్మశరీరము, కారణ శరీరము ఉంటాయని మన శాస్త్రాలు చెపుతాయి. అందరికీ స్థూలశరీరము తెలుసు - మనం చూడగలము, నేరుగా పోషిస్తాము కనుక, సూక్ష్మ శరీరము చూడకపోయినా (బుద్ధి, మనస్సు, చిత్తము, అహం అనే అంత:కరణాలుగా) అనుభవంలో తెలుసు. కానీ కారణ శరీరము మన అనుభవంలోక్ రాదు, ఇది కర్మ సిద్ధాంతము ప్రతిపాదించినది, కర్మని -పుణ్యమూ, పాపమూ- అనుభవించటానకి జన్మాంతరాల మధ్యకూడ ప్రయాణిస్తుంది. స్థూల, సూక్ష్మ శరీరాలతో ఉంటుంది, అవి నశించిన తరువాత ఉంటుంది}

మనిషి శరీరాన్ని ఆహారమూ, వ్యాయామములు వగైరాలతో చక్కగా పోషించుకుంటాడు (కొంతమంది మరీ ఎక్కువ పోషించేసి స్థూలకాయం తెచ్చుకుంటారు). కానీ సూక్ష్మశరీర పోషణ విషయములో సరైన అవగాహన లేక సంప్రదాయిక ఆచారాలతోనూ, సంఘ మర్యాదలను పాటించుతూ సరిపుచ్చుకుంటాడు. కానీ వాటితో సూక్ష్మ శరీర పోషణ జరుగుతుంటుంది కానీ పరిపుష్టం కాదు. ప్రాణాయామ, ధ్యాన, లేదా దేవతారాధనల ద్వారా అది జరుగుతుంది.

ఈ పోస్ట్ యొక్క ముఖ్యోద్దేశం దేవతారాధనలో కొన్ని మెళకువలు: ముఖ్యంగా మంత్రాచరణలు, ఎంత వీలైతే అంత, ఎంత ఆచరణ జరిగితే అంత ప్రయోజనము. 

మన మంత్రాలన్నీ సంస్కృతములోనే ఉన్నాయి. [అక్రరమాలలోని అక్షరాలన్నీ బీజాలేకానీ, “నేను ‘అ’ కారాన్ని” అన్నాడు కృష్ణుడు భగవద్గీత విభూతియోగంలో. అ+ఉ+మ్ = ఓం అని మనకు మాండూక్యోపనిషత్తు చెపుతుంది. అన్ని బీజాక్షర మంత్రాలకూ ‘ఓం’కారమే మూలం. సర్వసృష్టికీ ‘ఓం’కారమే మూలము, కానీ వేరుగా చర్చించాల్సిన అంశం.] సంస్కృత మంత్రాలు అర్ధం తెలియకున్నా సరైన ఉచ్ఛారణ ఉంటే, ఆ శబ్దతరంగాలకొక శక్తి ఉంది. మంత్రోచ్చారణ చేస్తున్న భక్తునికీ, దేవునికీ ఒక బంధము ఏర్పడుతుంది. అందుకే మన ఒక మంత్రము చదివినా, శ్లోకము, అష్టోత్తరము చదివినా ముగించాక ఒక అనుభూతిని పొందుతాము. అయితే అర్ధము చేసికుని, మెల్లగా చదివితే ఆ ఫలితము, అనుభూతి ద్విగుణం, బహుళం అవుతుంది. మంత్రము దేవతల సూక్ష్మరూపం కనక మన సూక్ష్మ శరీరములో మార్పులు తెస్తుంది - సహజంగానే మంచి మార్పులు. మంత్రాలలో కొన్ని సంకేతాలు ఆచరణీయాలు: అందుకే మంత్రాలను అర్ధం చేసుకోవాలన్న ప్రతిపాదన. అర్ధం చేసుకున్న తరువాత ఆ మంత్రాన్నీ, అర్ధాన్నీ ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారా మంత్రాల సంకేతము విస్తరిస్తుంది. నా కనుభవములోకి వచ్చిన కొన్ని మంత్రాలూ, వాటి ఆతరణలూ ఉదహరిస్తాను:

లక్ష్మీ అష్టోత్తర శత నామావళిలో ‘నమామి ధర్మనిలయాం’ - లక్ష్మీ దేవిని ధర్మదేవతగా నమస్కరిస్తున్నాను అన్నది అర్ధము. అయితే దానర్ధము ‘ఏదయితే ధర్మమో ఆ ధర్మానికి నమస్కరిస్తున్నానూ’ అనికూడా అర్ధము (నువ్వు నేనైతే, నేను నువ్వే అన్నట్లుగా). ఇది ధ్యానించి, (నమస్కరించ) ఆచరించతగ్గ మంత్రము, అర్ధము. మనకు అనేక ధర్మాలున్నాయి - ఒక పిల్లగా, చెల్లిగా, తల్లిగా, అన్నగా, అక్కగా, తండ్రిగా, పౌరుడిగా, జవానుగా, న్యాయమూర్తిగా, ....ఇలా అనేక పాత్రలలో అనేక ధర్మాలున్నాయి. పౌరుడిగా మనం వివిధ ప్రాంతాలలో వివిధ ధర్మాలు పాటించాలి, మనిషిగా అనేక దశలలో అనేక ధర్మాలు పాటించాలి. ధర్మమే లక్ష్మీ స్వరూపంగా మనస్పూర్తిగా భావించి, నమ్మి నమస్కరిస్తే ఆ ధర్మాలన్నీ పాటించటము ప్రారంభించాలి. పాటిస్తుంటే మొదట్లో కొన్ని కష్టాలు, ఇబ్బందులూ ఎదురౌతాయి. ఆ దేవతే అధిగమించే శక్తిని ఇస్తుంది. 

మరొక ఉదాహరణగా శ్రీ సూక్తములో ‘క్షుత్పిపాసామలాం జ్యేష్టామలక్ష్మీం నాశయామ్యహం 
అభూతమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహత్’

పై సూక్తిలో మనము భగవంతునికి నివేదిస్తున్నాము, అంటే అఖిలాండకోటిబ్రహ్మాండ నాయకునితో ఒప్పందము చేసుకుంటున్నాము: ఒకటి: ‘క్షుద్పిపాసామలాం, అలక్ష్మీం, నాశయామి, అహం’ అని. ఆకలిదప్పులు, అష్టదరిద్రాలు (లక్ష్మి అష్ట ఐశ్వర్యాలకు సంకేతమైతే ఆ దేవత అక్క జ్యేష్టాదేవి అష్టదరిద్రాలకు) నేను నిర్మూలిస్తాను. ఇది చేయాలంటే ఆ భక్తుడు పట్టుదలగా కష్టపడాలి, శ్రమించాలి, ఓర్పు వహించాలి, ప్రయత్నం చేయాలి - అది దేవత ముందు చేసే శపథం, నిజాయితీ ముఖ్యం, కనుక సూక్తం చదివి ఆచరణ వదిలేయటం కాదు.

రెండు: ఒకటికి ఈ భాగం కొనసాగింపు. ‘అభూతి, అసమృద్ధి, నిర్ణుదం, మే, గృహాత్’. విభూతి అంటే దేవుని కరుణాప్రసారం, విభూతి అంటే ఆనందము, ఉత్సాహము, సంతోషము, సుఖమూ వగైరా మనిషి ఆనందానుభవాలకు మూలకారణం. అభూతి అంటే వ్యతిరేకానుభవ కారణం. ‘నిర్ణుద మే గృహత్’ - అలాంటి అభూతిని, అసమృద్ధిని నా ఇంటినుంచి నిర్మూలిస్తాను అని మాట ఇచ్చినట్లు. మాటకు కట్టుబడి కృషిచేయటం. ఈ ప్రతిజ్ఞ వెనకాల వినయమే ఉంటుంది, తన నివేదన ప్రతిజ్ఞలా పాటించే శక్తి ఆ లక్ష్మియే భారం తీసుకుని అనుగ్రహించాలన్న నివేదన.

కామెంట్‌లు

  1. చాలాబాగుంది వేణు. అధ్బుతమెైన విశదీకరణ. ఎప్పుడు కొత్త విషయం బ్లాగులో పెట్టినా తెలియజేయి, చదివి ఆచరణలో పెట్టటానికి ప్రయత్నిస్తాను.

    రిప్లయితొలగించండి
  2. మీ బ్లాగ్ చాలా బాగుంది. మంత్రాచరణ గురించి చాలా బాగా విశదీకిరి0చారు. ఏ పురాణముల ..అన్నమయ్య కీర్తన గురించి కూడా వివరణ బాగుంది.శుభం భూయాత్.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగులో టైప్ చెయ్యటం ఎలా?

కుండలినీ యోగ - భౌతిక శాస్త్రం

అలౌకికం-లౌకికం