అధ్యాయం-ఆనందం
ఆనందమనే సముద్రంలో తేలియాడతాడు మనిషి చిన్నతనంలో. ఆ సమద్రతరంగాలు ఉవ్వెత్తున ఎగిసేందుకుకారణాలు చిన్నతనంలోని కొన్ని సంఘటనలూ, కొందరు వ్యక్తులూ.
కాలక్రమేణా మనకు కేవలం తరంగాలు, సంఘటనలూ, వ్యక్తులూ గుర్తుండిపోతారు. గాఢమైన ఆనందము తాలూకు ఛాయలైన ఈ తరంగాలు లోతైన ఆ ఆనందానికి కేవలం సంకేతాలుగా మిగిలి -ఆ ఆనందం విలువ తెలిసినా -ఆ ఆనందమెలా మళ్లీ పొందాలో తెలియదు.
ఆ వ్యక్తులూ, సంఘటనల వల్లనే ఆనందం కలిగిందని, వారు లేక ఆనందం లేదని బాధ కలుగుతుంది, కానీ ఆ వ్యక్తులు, సంఘటనలూ ప్రతి వ్యక్తి ఆనంద(సముద్రం లోని) వీచికలే...సముద్రం అలాగేఉంటుంది, కొత్త తరంగాలు వస్తూ ఉంటాయి
ఇది మనలో చాలా మందికి తెలుసు
‘బాల్యంలో ఆనందంగా లేను’ అనే వ్యక్తులు బహుశా బహు అఱుదేమో. ఉండకపోరు, ఉంటారు!
తల్లిదండ్రులు లేని అనాథలో, కటిక దరిద్రం అనుభవించే -ఆకలిబాధ, కాయకష్టం, ఎండకూ, వానకూ ఆశ్రయం లేని - పిల్లలో కావచ్చును.
వారిని ప్రక్కన పెడితే ప్రతి వ్యక్తి జీవితమూ బాల్యంలో మధురం, అతి మధురం.
ఇది నిజమా లేక మన భావనా? రెండూ కలిసి ఉంటాయి, విడదీయటం కష్టం.
ముందు భావన గుఱించి ఆలోచిద్దాం. కేవలం బాల్యమే బాగుందా?
ఈ మధ్యనే మేము - ఎమ్మెస్సీ విద్యార్థుల వాట్సాపు జట్టు - కలిసి మాట్లాడుకున్నాం. అందఱూ ‘అవి బంగారు రోజులు, మళ్లీ వస్తే బాగుండు, ఎంత బాగా ఆనందించి, అనుభవించామో..’ అనుకున్నారు. నేను మౌనంగా అంగీకరించాను. ఎమ్మెస్సీ అంటే 18-20 ప్రాయం. కానీ ఆ ప్రాయంలో వారిలో చాలా మంది (మీలోనూ) ‘అబ్బ…బడిలో చదువుకునేటప్పుడు ఎంత బాగుండేది!?!? ఆ టీచర్ని మనం ఏమనే వాళ్లం, గళ్ల చొక్కా వేసుకుని సన్నగా ఉండే వాడు, వాడిని బాగా ఏడిపించే వాళ్లం గుర్తుందా, గోడ దూకి పారిపోయే వాళ్లం, మధ్యలో డుమ్మా కొట్టి సినిమాకు వెళ్లేవాళ్లం,…’ అని 10-15 ప్రాయం జీవితం గుఱించి చెప్పుకుంటారు.
అంతా కన్నా తక్కువ వయస్సులో బహుశా చెప్పుకోలేరేమో కానీ ఇంకా చిన్నప్పుడు బాగుందనిపించేదేమో.
ఇదెలాగు అంటే, ఎప్పుడూ గత జీవితం బాగున్నట్లు అనిపిస్తుంది. కాకపోతే గతంలోకి వెళుతున్న కొద్దీ ఆ ‘బాగు’ మఱింత మధురంగా అనిపిస్తుందేమో. కొలవటం కష్టం.
ఏది ఏమైనా ఆ ఆనందానికి కారణమేమిటి? కారణాలు వెదికేముందు, మళ్లీ ప్రశ్న సముఖంలో ఉంచుకుందాం: అది నిజమా, కేవలం మన భావనా? అన్నదే ఇంకా మన ప్రశ్న.
కారణం అప్పటి పరిసరాలా, వ్యక్తులా, సంఘటనలా?
‘కొన్ని కావచ్చును, అన్నీ కావచ్చును’ అని తోస్తుంది.
మఱి, అవే వ్యక్తులనూ, పరిసరాలనూ ఇప్పుడు చేఱితే (కొంత ఆనందం వస్తుంది కానీ) ‘అదే స్థాయి’ ఆనందం పొందగలమా? పొందగలిగితే ‘అది’ నిజమే. కానీ చాలా మంది విషయంలో అలా జరగదు, జరిగితే ‘అప్పుడెలా ఉండే వాళ్లం, ఏమేం చేసుకునే వాళ్లం’ అని చెప్పుకోకుండానే ఆ ఆనందం కలిగించే విధంగా ప్రవర్తించే వాళ్లం, ఊహలో బ్రతకకుండా.
పెద్ద ఒడుదుడుకులు లేని వారు కూడా ఈ విషయం అంగీకరిస్తారు. జీవితాన్ని దశకాలుగా ఊహిస్తే
(ఇంకా ఉంది...చాలా..ఆ ఆనందాన్ని ఎలా పొందాలి? అన్నది)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి