స్తోత్రపఠనం

నవ విధ భక్తిలో పూజనము విశేష స్థానము కలిగినది. దేవుని ఆరాధించే సులువైన మార్గము. అనేక భక్తులు వీలైనప్పుడు / కొందరు ప్రతి దినమూ దేవతార్చన చేస్తూంటారు. మన సనాతన శాస్త్రములైన పురాణములలో అనేక స్తోత్రములు, అష్టోత్తరాలూ, సహస్రనామాలు ఉన్నాయి. ప్రతి స్తోత్రానికి ఉపోద్ఘాతము, స్తోత్రమూ, ఫలశ్రుతి  ఉంటాయి. 

సంస్కృత భాష భారతీయుల సంస్కృతిలో, జీవనములోనూ భాగమై ఉంది. వేదాలూ, ఉపనిషత్తులూ, పురాణాలూ, ఇతిహాసాలూ, సంహితలూ మొదలగనవి అన్నీ సంస్కృతములో లిఖించబడి భారతీయ వాజ్మయముతో పెనవేసుకుపోయాయి. ఈ శాస్త్రాల పట్ల భారతీయులకు పవిత్రమైన భావనే కాక ఆరాధనా భావను కూడా ఉన్నాయి. చిన్నప్పటినుంటి ఈ శాస్త్రాలను, వాటిలోని చిన్న భాగాలనైనా వింటూ భారతీయులు పెరిగారు. మాతృభాష సంస్కృతము కాకపోయినా సంస్కృతములో ప్రవేశము లేకపోయినా సంస్కృత మంత్రాలను, శ్లోకాలను విన్న వెంటనే ప్రతి భారతీయుడు పవిత్రమైన భావానికి లోనవుతాడు.

ఈ నేపథ్యంలో శ్రద్ధ కలిగిన భక్తులు దేవతార్చన చేయునప్పుడు సంస్కృతములోని శ్లోకాలూ, మంత్రాలూ పూర్తిగా అర్థము కాకపోయినా అర్చనానంతరము మానసికంగా ఉత్తేజితుడవుతాడు. దీనికి కారణం సంస్కృత భాషయొక్క శబ్దమాధుర్యము, ఉచ్చారణా ప్రభావము.

సంస్కృతములో ప్రవేశమూ, స్తోత్రాల అర్థమూ తెలిస్తే ఆ భావన మరింత బలీయంగా, లోతుగా అనుభవంలోకి వస్తుంది.  అర్ధము పెరుగుతున్న కొలదీ స్తోత్రములో ఏ భాగాలపై ఏకాగ్రత ఉండాలో కూడా అర్థమవుతుంది. 

సాధారణంగా ఉపోద్ఘాతము అనేది ఆ స్తోత్రము లేదా మంత్రము ఎలా ఆవిర్భవించినది అన్నది తెలియచేస్తుంది. అలాగునే ఫలశ్రుతి కూడా ఏ భక్తులకు ఎలాంటి ఫలితాలనిస్తాయో చెపుతుంది. ఈ రెండూ చదువుతున్నప్పుడు కూడా భక్తుడు పరవశానికి లోనవుతాడు. అయితే భక్తుడు స్తోత్రభాగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది ఎలాగంటే, వైద్యుడు ఇచ్చే ప్రిస్క్రిప్షను లాంటిది ఉపోద్ఘాతము, అందులో ఇచ్చిన మందులు ఎన్నిసార్లు ఎలా తీసుకోవాలి అన్నది ఫలశ్రుతి. ఈ రెండు శ్రద్ధగా ఒకటికి రెండు సార్లు చదివి, అర్ధము చేసుకుని ఆ ప్రకారము మందులు స్వీకరించాలి - ఇది స్తోత్రభాగము - ఆరోగ్యము పొందటానికి. 

మందుతీసుకున్న ప్రతిసారి మనం ప్రిస్క్రిప్షను చదవనక్కరలేదు -అంటే ఉపోద్ఘాతము, ఫలశ్రుతి చదవనక్కరలేదు. కానీ మందు తీసుకోవాలి, స్తోత్రభాగము పై ఏకాగ్రత ఉంచాలి. దీనివల్లన స్తోత్రము అర్థము చేసుకొనటమే కాక సమయమూ తగ్గుతుంది. 

స్తోత్రభాగాన్ని కొంచెము కొంచెముగా అర్థము చేసుకుంటూ, ఆ అర్ధాన్ని భావిస్తూ, ధ్యానిస్తూ పఠనము లేదా ఉచ్ఛారణ చేయాలి. కొద్ది కాలంలో స్తోత్రమంతా అర్థమయి దివ్యానుభూతి కలుగుతుంది. వరుసగా కొన్ని స్తోత్రాలను చదివేకన్నా ఒక స్తోత్రాన్ని భావిస్తూ, ధ్యానిస్తూ పఠించితే ఫలితము ఎక్కువ. పఠనము ముగిశాక ధ్యానముద్రలో భక్తుడు కొంచెము సేపు మౌనంగా ఉండాలి. ఈ మౌనకాలంలో మంత్రము భక్తుని మనస్సు పై పనిచేసి సూక్ష్మశరీరాన్ని పుష్టిపరుస్తుంది. ఈ ప్రభావంతే భక్తుడు భగవంతునికి దగ్గర అవుతాడు. 

కాలక్రమేణ మన లోని దివ్యానుభూతి పెరగటమే మన సాధనకు ఫలితమూ, నిదర్శనము. అనుభూతిలో వృద్ధి కనపడనప్పుడు మనం యాంత్రికముగా అర్చన చేస్తున్నామని తెలుసుకుని పంథా సవరించుకోవాలి.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగులో టైప్ చెయ్యటం ఎలా?

కుండలినీ యోగ - భౌతిక శాస్త్రం

అలౌకికం-లౌకికం