ఏకాదశి
పాపం-పుణ్యం
పుణ్యమంటే శాస్త్రం ఏమి చెప్పింది: పునాతి ఇతి పుణ్యం. అంటే పవిత్రీకరించునదీ, పరిశుభ్రత చేసే కార్యము పుణ్యకార్యం.
కానీ పాపం అంటే ఇంత స్పష్టమైన నిర్వచనం కనపడలేదు, అందుకని పుణ్యకర్మలు కానివన్నీ పాప కర్మలు అనిపించుతోంది. (ఇది తప్పేమో కూడా. ఎందుకంటే, శూన్యం నుండి ఒక వైపుకు ధనరాశులు (పుణ్యం) అనుకుంటే వ్యతిరేక దిశలో ఋణరాశులు(పాపం). అంటే రెండింటి మధ్య రెండింటిని కలుపుతూ, సమన్వయపరుస్తూ “సున్న” ఉంది. అలాగే మనిషి కర్మలలో కొన్నిపుణ్యాన్నిస్తే, కొన్ని పాపాన్ని ఇస్తాయి, మిగిలినవి ఏ ఫలితాన్నీ ఇవ్వకుంటాయి. ప్రతి పనికి పుణ్య, పాప ఫలితాలుంటాయా? రెండూ కాని ఫలితములూ ఉంటాయేమో)
కర్మ అంటే గీతలో ‘యజ్ఞం’ అని చెప్పబడింది. యజ్ఞం అనేది మనిషి భగవంతుని చేర్చే క్రమం, క్రియలు అని చెప్పబడింది. తద్వతిరిక్తమైన క్రియలన్నీ యజ్ఞమూ, కర్మలూ కావు అని అర్ధం వస్తుంది. యజ్ఞకర్మలు మనిషిని పవిత్రుని (పుణ్యుని) చేస్తే మిగిలినవి మనిషిని అదేస్థాయిలో ఉంచటమో, పాపుని చేయటము జరుగుతుంది. ఇక్కడ పాపమంటే అపవిత్రమనే తలంచవలెను.
ఏకాదశి ఉపవాసం వల్లన పుణ్యం లభిస్తుందా?
పుణ్యమంటే పవిత్రీకరణమనుకుంటే, శరీరము, మనస్సు శుద్ధి చెందుతాయి. కేవలం ఒక్క ఏకాదశి వల్లన కాదు, క్రమేపి జరుగుతుంది.
ఏకాదశి నిర్జలాహారం వల్లన మనిషి శరీరంలో జీర్ణక్రియలు (ఆహారము, నీరూ స్పీకరించక) క్రమంగా తగ్గి, కొన్ని గంటల తరవాత జీర్ణక్రియ పూర్తిగా ఆగి శరీరంలో అన్ని విభాగాలూ విశ్రాంతి తీసుకుంటాయి. బహుశా 18 గంటల తరవాత - ఉపవాసం ముందు స్వీకరించిన ఆహారం 3 గంటలు కడుపులో, 6 గంటలు చిన్న ప్రేవులలో, 9 గంటలు పెద్ద ప్రేవులలో జీర్ణించ పడుతూంటాయి, అంటే 3 గంటల తరవాత కడుపు, 9 గంటల తరవాత చిన్న ప్రేవులు, 18 గంటల తరవాత పెద్ద ప్రేవులు, ఆ పై అన్నివిభాగాలూ విశ్రాంతి తీసుకుంటున్నా, మరమ్మత్తు శాఖలు పని చేస్తాయి - అవే జీవకణాలు, కొన్ని భాగాలు. ఇవి దినమంతా కూడా పనిచేస్తూంటాయి - అనేక లక్షల రసాయన చర్యలు చేస్తూ, శరీరంలో వేడిని కాపాడుతూ, పోషకాలను స్వీకరిస్తూ, వ్యర్ధాలను బయటకు పంపుతూండే ప్రతి జీవకణానికి ఈనాడు పోషకాలను తీసుకునే పని ఉండదు (18 గంటల తరవాత పోషకాలేమి రావు కనుక), కేవలం వ్యర్ధాలను బయటకు పంపే పనే కనుక మరింత ఆ పనే, శ్రద్ధగా చేస్తాయి.
(అ) భారం తగ్గింది కనుక వేగం, నాణ్యతా పెరిగి ఎప్పటినుంచో మిగిలిన వ్యర్ధాలను బయటకు పంపే అవకాశమూ దొరుకుతుంది. రోజూ బయటకు పంపే వ్యర్ధాల కన్నా తక్కువ మొత్తమే అయినా, రోజుల తరబడి లోపల ఉండిపోయిన విషవ్యర్ధాలను (విషమంటే హానికరమైనవని) బయటకు పంపుతాయి.
(ఆ) జీవకణాల లాగునే మూత్రాశయానికి కూడా 18 గంటల తరవాత, ఎప్పటి వలే కాక చాలా భారం తగ్గుతుంది. వ్సర్ధాలుతగ్గుతాయి. అయితే పైన “అ”లో చెప్పినట్లు పాత చెత్తనంతా బయటకు పంపే అవకాశం దొరుకుతుంది.
ఈ విధంగా ప్రతి అవయవం లోని జీవకణాలు (ఇక్కడ కణాలంటే అనేక రకాల కణాలూ - చర్మ కణాలూ, రక్త కణాలూ, లింఫుకణాలూ - రోగ నిరోధక శక్తికి - మరమ్మత్తు పై పని చేశే అవకాశం, తగినంత సమయమూ దొరుకుతాయి.
శరీరంలోని వ్యర్ధాలు తొలిగి పోతూ అంత:శరీరం శుభ్రమవుతుంది. జీర్ణక్రియ ఒత్తిడి తగ్గి, ఆ క్రియపై ధ్యాస పెట్టవలసిన మెదడు భాగం కూడా విశ్రాంతి తీసుకుంటుంది. అనుబంధ శాఖలకు విశ్రాంతి దొరుకుతుంది.
శరీరానికీ, మనస్సుకు మరింత నాణ్యమైన నిద్రా, విశ్రాంతీ లభిస్తాయి. ఇది ఉపవాసం చేశే అందరూ గమనించగలరని అనుకుంటాను. ఇది చాలా ముఖ్యమైన అంశం.
ఉపవాసానికి ముందురాత్రి కూడా ఉపవాసము ఉండాలి. (చాగంటి గారు ఏకాదశి పై ఇచ్చిన ప్రవచనంలో విని, ఆచరించి గమనించాను. ముందు రోజు నుండి మొదలు పెట్టాం కనుక, ఏకాదశి నాటికి శారీరకంగా, మానసికంగా సిద్ధమవుతాం) ఏకాదశి నాడు ఎటూ ఉపవాసమే. ద్వాదశి నాడు ఉదయం 7-8 గంటలకు స్వల్పాహారంతో ఉపవాసం ముగుస్తుంది.
అంటే దశమి వాడు సాయంత్రం 5 గంటల నుంచి, ద్వాదశి వాడు 7గంటల వరకు అనుకుంటే మొత్తం (7+24+7) 36-38 గంటల నిర్జల ఉపవాసం. అందులో 18 గంటలు తీశివేస్తే, జీర్ణక్రియకు/మరమ్మత్తుకు 18-20 గంటల విశ్రాంతి/పని చేశే అవకాశమూ దొరుకుతాయి ప్రతి రెండు వారాలకూ. ఇంత అవకాశము మన శరీరానికి మనమెప్పుడన్నా ఇచ్చామా?
శనివారం ఉపవాసాలు కొంత వరకూ ఈ దిశలో ఉపయోగమున్నా, రాత్రి అన్నం తక్క ఏదో ఒకటి తింటూనే ఉంటారు చాలామంది. రాత్రి ఏమీ తినకుండా ఉంటే (‘ఏకభుక్తం’ అంటారు - సహజంగా పగలు మాత్రమే) కొంచెం ప్రయోజనం. కానీ ఏకాదశి నాడు లభించినంత అవకాశం శనివార ఉపవాసాలకు లభించదు.
ఇంక - ఇలాగు ఏకాదశినాడే చెయ్యాలా? అంటే, అవసరం లేదు. ఈ విధంగా ప్రతి రెండవ ఆదివారమో (శలవు కనుక) చేశినా ఇదేఫలితం. శరీర, మానసిక ఆరోగ్యాలు మరింత మెరుగు పడతాయి. మనిషి ఎక్కువ కాలం జీవించ గలడు.
శరీరమూ, మనస్సూ శుద్ధి చెందటమే పవిత్రం, అంటే పుణ్యం ఇక్కడ. ఏ జాతి వాడైనా ఈ ప్రక్రియ ద్వారా ఇలాంటి పుణ్యాన్ని సంపాదించుకోగలడు. ఈ ప్రక్రియ ద్వారా ఇది అందరికీ సాధ్యం.
జీవించి ఏమి సాధించాలి? అది వ్యక్తిగత అభిప్రాయం.
అయితే ఇలాంటి ఉపవాస ప్రక్రియకు మన శాస్త్రం భగవద్ధ్యానాన్ని కూడా జత పరచి మానసిక ధ్యానం, విశ్రాంతులను మరిన్ని రెట్లు పెంచాయి. దీర్ఘాయుష్షూ, ఆనందమూ లభిస్తాయి. సనాతన ధర్మం మనిషి జీవితానికి లక్ష్యం “భగవత్సిద్ధి” అని నిర్ణయించింది. దానికి అనేక సంవత్సరాల సాధన కావాలి. సాధన ఫలించాలంటే మనిషికి దీర్ఘాయుష్షు, ఆరోగ్యమూ అవసరం. భగవద్సిద్ధిని మించి మనిషికి మోక్షాభిలాష - మోక్షం అన్న కోరిక- కలగాలి. అంతకు మించి “జీవన్ముక్తికై” అభిలాష కలగాలి. జన్మలెన్ని, ఏ జన్మ, పునర్జన్మ వగైరాలన్నీ మనకూ ఈ జీవితంలో సమాధానం దొరకని అంశాలు. మన పూర్వజన్మ (అంటూ ఒకటి ఉంటే అదేమిటో ) తెలియదు. తదుపరి జన్మ ఉంటుందా (రేపనేది ఉంటుందని మనకి తెలుసు, కొన్ని రోజులూ, సంవత్సరాలూబ్రతికాం కనుక) తెలియదు. జన్మంటూ ఒకటి ఉందని మాత్రం తెలుసు, పుట్టామూ-జీవిస్తున్నాం కనుక. ఈ జీవితంలోసాధించేయాలి. సాధనకు ప్రయత్నించాలి, బ్రతికి ఉన్నంత వరకూ.
మోక్షమూ, జీవన్ముక్తీ లభిస్తాయా? లభిస్తాయనే మన శాస్త్రాలు చెపుతున్నాయి. మోక్షమంటే ముక్తి అని నిర్వచనం. దేని నుంచి? ఈ తాపత్రయాలనుంచి. మోక్షమంటే విష్ణులోకం వగైరాలు (అని కొందరి అభిప్రాయం, శరీరం నుండి దివ్యకాంతి బయటకు వచ్చిఅలా….పైకి పోవటమని …కొందరి ఊహా) కాక ఈ జీవితంలోనే కష్టాలను అధిగమించి, ఎప్పుడూ (సదా) ఆనందంగా (సుఖంగాఅని కాదు) ఉండగలగటం - అని కూడా చాలా మంది విజ్ఞులు చెపుతారు. సాధన చేస్తూంటే ఈ ఛాయలు మన జీవితంలో గోచరిస్తాయి. అదే మనకు నిదర్శనం ముందుకు సాగిపోవటానికి.
దానికి భక్తి గొప్ప మార్గం. జ్ఞాన మార్గం కన్నా భక్తి (మూఢ భక్తికాదు) మార్గం సులభం. ఎప్పుడైతే మూఢ భక్తి కాదు అన్నామో, భక్తికీ, మూఢభక్తికీ తేడా తెలిపేందుకూ జ్ఞానమూ అవసరమని తెలుస్తుంది. కొంచెం జ్ఞానము, మరింత (భక్తి) సాధనా …ఇలా అంచెలంచెలుగా సాగాలి.
మొత్తానికి ఉపవాసాలు సాధనకు పునాదులు వేస్తాయి- ఎవరికైనా, ఏ స్థాయిలో ఉన్నా.
ఉపవాసం చేస్తే తలనొప్పి, నీరసం..వీటికి భయపడి మానేశా...బహుశా శరీరానికి ఉపవాసం నెమ్మది.నెమ్మదిగా అలవాటుచేయాలేమో
రిప్లయితొలగించండిఅవును!! ఉపవాసం చేస్తే ఆరోజు మధ్యాహ్నానికి తలనొప్పి, కాళ్ళు నొప్పులు మొదలవుతున్నాయి!! భగన్నామ స్మరణ అటుంచితే, ఎప్పుడెప్పుడు తిందామా అనే ఆలోచన!! ఉపవాసం ఎలా మొదలు పెట్టాలో, ఎలా కొనసాగించాలి అని కూడా చెప్పు బాబాయ్
రిప్లయితొలగించండి