మనుష్యజన్మ - మోక్షం

 *దుర్లభం త్రయమేవైతద్దేవానుగ్రహ హేతుకమ్!*

*మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః!!*


మనుష్యజన్మ, మోక్షం పొందాలనే తపన, మహాపురుషుల ఆశ్రయం అనే మూడూ లభించడం దుర్లభం. కేవలం దైవానుగ్రహం వలన మాత్రమే ఇవి ప్రాప్తిస్తాయి.

 

3 వ శ్లోకం, వివేక చూడామణి

శ్రీ జగద్గురు ఆదిశంకర భగవత్పాదులు


మనుష్యజన్మ, మోక్షాభిలాషా, మహాపురుషుల ఆశ్రయం - మొదటిది, జన్మ, లభించింది. రెండవది మనకు సరిగ్గా అర్ధంకాక (కోరుకుంటున్నా సరిగ్గా)కోరుకోవటం లేదు. మహా పురుషుల ఆశ్రయం మన చేతిలో లేదు.  ఈ విషయంలో రెండు అంశాలు - ఈ రోజుల్లో మహాపురుషులెవరో కూడా చెప్పలేం. పీఠాధిపతులా, జీయరులా, ప్రవచనకారులా, బాబాలా, ఎవరు? వీరు కాకపోవచ్చును. తను ఆచరించి చూపేవాడు కావాలి. అలాంటి వారు దొరకటం కష్టం, దొరికినా మనకు ఆశ్రయం (మోక్షమార్గానికి/సాధనకు సహాయపడటం) జరగకపోవచ్చును. ఇక మిగిలింది రెండవదే- మోక్షాభిలాష. దీన్నే కొంచెం అస్పష్టంగా - కోరుకుంటున్నా సరిగ్గా కోరుకోవటం లేదు - అన్నాను. 


మోక్షమంటే మనకేవో అస్పష్టమైన ఆలోచనలున్నాయి. మనం శ్రద్ధగా ఏ గ్రంథమూ చదవం కనక ఆ అస్పష్టమైన ఆలోచనలతోనో అంటకాగుతూంటాం. 


“క్ష” అంటే నాశనమయేది (క్షరము, క్షీణించునది), మోక్షమంటే “ఎప్పటికీ క్షీణించనది” - అదే “ఆనందం”. “ఎప్పటికీ క్షీణించని నిరంతర ఆనందం”


మనం కోరుకుంటాం - ఆనందంగా ఉండాలని. లోకంలో ఎవరుంటారు ఆనందం వద్దని?


కానీ సరిగ్గా కోరుకోం - “ఆ ఆనందం నిత్యం, నిరంతరంగా ఉండాలి” అని కోరుకోం. కోరుకున్నట్లు అయితే అదే “మోక్షాభిలాష”. మోక్షమంటే వయసుడిగిన వాళ్లూ, చేతకాని వాళ్లూ, లేదా సన్యాసులూ కోరుకోవలసిందీ అని కాదు. మన అందరం కోరుకోవాలి. కోరుకుంటే మార్గం అదే తెలుస్తుంది - ఆ తెలిసే విధానమే అధ్యయనం, సాధన. 


సాధనకు చాలా సమయం పడుతుంది, కానీ సాధన కాలంలో ఆనందం పెరగటం స్పష్టంగా తెలుస్తుంది. 


సాధించటానికి అందరం ఎక్కువ కాలం జీవించాలి - దీర్ఘాయుష్యులం కావాలీ, కోరుకోవాలి. తగినట్లు పుష్టిగా ఉండటానికి ఆరోగ్యాన్నీ, శరీరాన్నీ మలుచుకోవాలి. ఇది ఎవరి ఆశీర్వచనాల ద్వారానో, “విష్ యూ హేపీ…” లాంటి గ్రీటింగుల ద్వారా రాదు. అందరికన్నా తల్లి బిడ్డల శ్రేయస్సు అమితంగా ఆశిస్తుంది. ఆశీర్వచనాలు (పని చెయ్యవచ్చు కానీ) పని చేస్తే ఎవరికీ కష్టాలనేవి ఉండేవి కావు. 


ఎవరి ఆకలి వారి తింటున్నట్లు, ఎవరి బాధ వారు అనుభవిస్తున్నట్లు, ఎవరి లక్ష్యసిద్ధికి వారే నడుం బిగించి సాధనా, కృషీ చెయ్యాలి. ప్రక్కవారు కేవలం మాట సాయం చెయ్యగలరు, గురువుంటే మార్గసాయం చెయ్యగలరు. 


ఇవన్నీ ప్రతి మనిషీ సాధించగలిగేవే. భగవంతునిలో ఐక్యమే మోక్షం కాదు. అది మోక్షానికి పరాకాష్ఠ, అంతే


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తెలుగులో టైప్ చెయ్యటం ఎలా?

కుండలినీ యోగ - భౌతిక శాస్త్రం

అలౌకికం-లౌకికం